పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-6 శ్రీరాగం సంపుటం: 08-084

పల్లవి:

ఎత్తరే ఆరతులీపె కింతులాల
హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ

చ. 1:

హరి వురముపై సొమ్ము అరతఁగట్టినతాళి
సరిలేని దేవుని సంసారఫలము
సిరులకుఁ బుట్టినిల్లు సింగారములవిత్తు
మెరుఁగుఁబోడి యలమేలుమంగ

చ. 2:

పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
కెరలుచునితఁడు భోగించే మేడ
సరసపు సముద్రము సతమైన కొంగుపైఁడి
అరిదిసంపదలది యలమేలుమంగ

చ. 3:

శ్రీవేంకటేశుని దేవి చిత్తజునిఁ గన్నతల్లి
యీ విభుఁని కాఁగిటిలో యేచిన కళ
బూవపు పెండ్లిమేలు పొందిన నిధానము
ఆవల నీవల నీపె యలమేలుమంగ