పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0214-5 మెంచభౌళి సంపుటం: 08-083

పల్లవి:

ఎంతవానికెంతవట యేలే యింత
మంతనాన నుండియును మాకుదీరదా

చ. 1:

కొప్పు దువ్వితేఁ బతిపైఁ గోపగించుకొనేవేమే
తప్పులేని తప్పుమోపి తమకింతురా
విప్పుచుఁ బ్రియము చెప్పి వేఁడుకొనీ నాతఁడే
దప్పిదేరె మోవిచూచి దయ వుట్టదా

చ. 2:

ధీరతతోఁ జెక్కు నొక్కితేను విదిలించేవేమే
దూరులేని దూరుగట్టి దొమ్మిసేసేవు
సారపు నీసుద్దులెల్లా చవిసేసినాతఁడే
ఆరీతినాతనిఁ జూచి ఆయము గరఁగదా

చ. 3:

చిప్పిలఁ గాఁగిలించితే జీరవారెననేవేమె
చొప్పులేని చొప్పులెత్తి సూడువట్టేవే
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
చొప్పులుగాఁ బెంజెమట చూచి చింత వాయదా