పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-4 శుద్ద దేశి సంపుటం: 08-076

పల్లవి:

వెల్లవిరాయఁ బనులు వేసాలేలే
గొల్లదానవా నీవు కొంకనిఁకనేఁటికే

చ. 1:

కన్నులతేటలు వారె కళలు మోమునమీరె
చిన్నదానవా యింకా సిగ్గులేఁటికే
చన్నులకొండలమీద చంద్రవంకలవె నిండె
కన్నెపడుచవా నీవు కప్పి దాఁచనేఁటికే

చ. 2:

పాలుకొనెఁ బులకలు పమ్మె సిగ్గుమొలకలు
గోలదానవా యేమి గుట్టుదాఁచేవే
తూలుచును నీకొప్పు తుమ్మిదలెల్లా బెదరె
బాలదానవా వట్టిభఁయము నీకేఁటికే

చ. 3:

గాఁటపు నిట్టూర్పురేఁగె కమ్మని మోవెల్లరేఁగె
నేఁటిదానవా నీవు నివ్వెరగేలే
యీటువెట్టి శ్రీవేంకటేశుఁడిదె నిన్నుఁ గూడె
మాఁటుదానవా నీకు మతకములేఁటికే