పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-5 ధన్నాశి సంపుటం: 08-059

పల్లవి:

వేసవియెండలుండునా వేరె వానకాలానకు
పాసినకాఁకలు రతి పచరించ వచ్చునా

చ. 1:

పేరఁబెట్టితే వలపు పెరుగువంటిదెపో
కేరి కాఁచఁబోతే విరిగి పోవుఁ గాని
గారవించే రమణుని కతలకు లోఁగావే
దూరఁబొయ్యేవుగనక తుత్తుమురౌ మనసు

చ. 2:

చవిగొంటే తమకము చక్కెరవంటిదె పో
కవ వాసితే అట్టె కారమౌఁ గాని
నవకపు నాయకుని నవ్వులెల్లాఁ జేకొనవే
తిరిరేరుగనక పై తీగె సాగు చలము

చ. 3:

పనిగొంటే జవ్వనము బంగారువంటిదె పో
దినములు దొబ్బితే వన్నెదీఁ గాని
యెనసెను శ్రీవేంకటేశుఁడు న(ని?)న్నింతలోనే
పెనఁగేవుగనక ముప్పిరిగొను బీరము