పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-5 తెలుఁగుఁగాంబోది సంపుటం: 08-263

పల్లవి:

ఇంకా నింకా రమణుఁడు యేమనీనె
వంక లొత్తఁబోతేను వాసివుట్టీ నాకు

చ. 1:

చనవు తానిచ్చినది చలములో మాఁటాడితి
పెనఁగఁ బోయితే మరి పిరివీకులె
తనమాఁట నామాఁట తరుణు లెరుఁగుదురు
ననిచి తడవఁబోతే నవ్వువచ్చీ నాకు

చ. 2:

సమ్మతించినదె తాను సరసము నేనాడితి
కమ్మరఁ గమ్మర నయితే కసిగాట్లె
నెమ్మనము లిద్దరివి నిండుక అట్టె వున్నవి
పమ్మి కొసరఁగఁబోతే పచ్చిదోఁచీ నాకు

చ. 3:

నేరిపె నన్నియుఁ దా నెయ్యమున నేఁగూడితి
తారుకాణించఁగఁ బోతే తగులాయమె
యీరీతి శ్రీవెంకటేశుఁ డిన్నిటాను నన్నునేలె
చేరి చెనకఁగఁబోతే సిగ్గువచ్చీ నాకు