పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-5 ఆహిరి సంపుటం: 08-215

పల్లవి:

ఏమిసేసినాఁ జేయనీ యియ్యకొనవే
వేమరు నింతగలదా విభునితోను

చ. 1:

వచ్చినట్టె వచ్చితేను వలుపేపో సుఖము
హెచ్చి మాటలాడితే నెరఁగఁగాని
కుచ్చిపట్టి నాయకుఁడు కొంగువట్టి తియ్యఁగాను
పచ్చిగానుఁ బెనఁగేవు పాసివుండఁ గలవా

చ. 2:

చెప్పినట్టు సేసితేను చిత్తమేపో చుట్టము
యెప్పుడూ నొడ్డారమైతే నెరఁగఁగాని
వొప్పుగా నాయకుఁడు వొడఁబరచఁగా నీవు
తప్పులెంచే వప్పుటిని తాలిమికిఁ గలవా

చ. 3:

మెట్టినట్టె మెట్టితేను మీకు మీకేపెండ్లి
యిట్టె సిగ్గులు వడితే నెరఁగఁగాని
వొట్టుక శ్రీవెంకటేశుఁ డొనగూడె నిన్నును
గుట్టుతోడ నవ్వేవు గురిసేయఁ గలవా