పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-4 శ్రీరాగం సంపుటం: 08-196

పల్లవి:

అలయఁగఁ బొద్దులేదా అప్పటినీకు
చలివానె లేవయ్య జాగులెందాఁకాను

చ. 1:

అంగమెల్లఁ జెమరించె నట్టే గందము గరఁగె
సింగారించుకొన్న కొప్పు చీఁదరరేఁగె
యెంగిలి వాయఁగ నీకు నిదే జలకమువట్టె
సంగతిగా లేవయ్య జాగులెందాఁకాను

చ. 2:

పులకలు గడునిండె బుసకొట్లు చెలఁగె
తెలుపెక్కి కనుచూపు తేటవారెను
బలుపుసత్తువరాను పాలునేయిఁదెచ్చితిని
సళుపక లేవయ్య జాగులెందాఁకాను

చ. 3:

మోమునఁ గళలుముంచె మోవిపై చేఁతలురాఁగె
నాముతో శ్రీ వెంకటేశ నన్నుఁ గూడితి
చేముట్టిచ్చే మాటుమందు చెనకుల నాతోపొందు
జామాయను లేవయ్య జాగులెందాఁకాను