పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-3 భైరవి సంపుటం: 08-195

పల్లవి:

మఱి యేమి సేసునే మంచివే యన్నిపనులు
వెఱపులెల్లాఁ దీర వేఁడుకొనీఁగాక

చ. 1:

ఆసగలిగినవాఁడు ఆతఁడు నీయడకును
వేసరునా మీఁద మీఁద వేడుకేకాక
రాసికెక్క నంతేసి రతి నలయింతువట
మోసపోయీనా నీకు మొక్కేఁగాక

చ. 2:

పైపై వలచినవాఁడు పంతపు నీచేతలకు
కోపగించునా మరిఁ గోరేదేకాక
తీపుమోవితేనెలిచ్చి తెలిపి చొక్కింతువట
వోపననినా నిన్ను వొడఁబరచీఁగాక

చ. 3:

కాఁగిటఁ గూడినవాఁడు కడు నీచెనకులకు
లోఁగీనా యెంతైనా లోఁగొనీఁగాక
చేఁగదేరఁ గూడితివి శ్రీ వెంకటేశ్వరునట
దాఁగీనా నీ యింపులకుఁ దమకించీఁగాక