పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-6 సామంతం సంపుటం: 08-018

పల్లవి:

కక్కసించఁ బనిలేదు కడనున్నవారికెల్లా
చక్కని నీవలపులే సాదింతువెపుడు

చ. 1:

చనువుగలవారిది చక్కనిమాట
వినవలసితే నీవు వింటివప్పుడే
మనసువచ్చినవారి మనవులెల్లా
కనుసన్నలోననే కైకొందువపుడే

చ. 2:

చెల్లుబడిగలవారు చేసినచేఁత
చెల్లఁ బెట్ట వలసితేఁ జెల్లింతువు
వుల్లమువచ్చినవారి వూడిగాలెల్లా
మెల్లనే యేపాటైనా మెత్తువు నీవు

చ. 3:

అంది పొందినట్టివారి యాసలెల్లా
యెందునున్నానొనగూర్చి యీడేర్తువు
కందువ శ్రీవేంకటేశ కలసితివి
ముందె నన్ను మెచ్చితివి ముచ్చటతోనపుడు