పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-4 కన్నడగౌళ సంపుటం: 08-185

పల్లవి:

హత్తి రాజసపువాఁడ వయినాఁగాని
చిత్తమువచ్చినయట్టు సేతువుగాని

చ. 1:

చనవు గలిగేనంటా సారె సారె మాటలాడె
విని విని నీవేమి వేరకుమీ
మనసునఁ గలదెల్లా మరిదాఁచనే నీకు
మునుకొన్న సతులకు ముచ్చట స్వభావము

చ. 2:

నిండిన మందెమేళాన నీతో సరసమాడేను
అండనే అందుకు లోనై అలయకుమీ
వుండిన దున్నట్టేకాని వూరకే కల్పించనోప
నిండు గరితెలాడితే నిజమునిష్టూరము

చ. 3:

కాతరాన నిన్ను నిట్టే కాఁగిలించుక కూడితి
నాతమకములుచూచి నవ్వేవు సుమ్మీ
ఘాతల శ్రీవెంకటేశ కైకొంటివి నిన్ను దూర
రాతిరిఁబగలునుండి రతులఁ జొక్కితివి