పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-5 సాళంగం సంపుటం: 08-179

పల్లవి:

మొగమోటమున నీకు మొక్కే నేను
తగవులఁబెట్టుకొని దగ్గర నున్నాఁడవు

చ. 1:

నేరుపుగల మగువ నిన్నుఁ బిలిపించితేను
వోరుపుగలిగినాపె వొద్దఁ గూచుండె
మేర పరి నవ్వరాదు మెలుఁతను దూరరాదు
నీరువంకతుంగవలె నీవున్నాఁడవు

చ. 2:

కన్నులు గొప్పలైనాపె గక్కన సన్నసేసితే
చన్నులు పిన్నలైనాపె చల్లె వలపు
నిన్నుఁ గైకొనఁగరాదు నెలఁతఁ బొమ్మనరాదు
అన్నిటా రొంపికంబమవై నీవున్నాఁడవు

చ. 3:

ఆయాలు సోఁకించినాపె అట్టె నిన్నుఁ గూడితేను
మాయలు నేరిచినాపె మరిఁ గూడెను
యీయెడ శ్రీవేంకటేశ యిద్దరి మిమ్మనరాదు
పాయక నా వురముపై పంతాననున్నాఁడవు