పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-3 వరాళి సంపుటం: 08-171

పల్లవి:

శిరసుండ మోకాలికి సేసలు చల్లిన యట్లు
మురిపేన చెలికత్తె మొగమేమి చూచేవే

చ. 1:

చెంతలఁ బిలువఁగాను చెలి వూరకుందానవు
పంతము దప్పిన యట్టే పలుకఁగాను
వంతుతో నీ రమణుఁడు వద్ద నిట్టే వుండఁగాను
మంతనానఁ జెలులచే మాటలాడించేవే

చ. 2:

కొనగోరఁ జెనకఁగాను గుట్టుసేకొనేవీడ
ననుపున నాఁటినట్టే నవ్వఁగాను
యెనసి యాతఁడు నీయెదటనే వుండగాఁను
చనవిచ్చి చెలులను సాకిరి గోరేవే

చ. 3:

వున్నతిఁ గాఁగిలించితే నొంటినే సిగ్గువడేవు
చన్నులు గుంగినట్టే సరినొత్తఁగా
అన్నిటా శ్రీ వేంకటేశుఁడాదరించి నిన్నుఁగూడె
చెన్నుఁడంటానితనిఁ జెలితో మెచ్చేవే