పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0224-6 కన్నడగౌళ సంపుటం: 08-144

పల్లవి:

ఇంతసేసినవాఁడవు యిదినేరవా
కాంత వున్నభావము కందువు రావయ్యా

చ. 1:

చెక్కుల లేఁతచిగురు చేతిలోఁ దామరపవ్వు
వొక్కపరేఁ రెండనబ్బెనువిదకును
యెక్కడయేసునో మరుఁడు యెవ్వరి మర్మమంటునో
చొక్కముగ నీతిఁ జూతువు రావయ్యా

చ. 2:

ఱెప్పల ముత్యాలవాన ఱేసులనే మీలయీఁత
అప్పుడే రెండూఁ గలిగెనంగనకును
తప్పులెవ్వరివల్లనో దైవికమెట్టున్నదో
చొప్పులీ వనితవల్లఁ జూతువు రావయ్యా

చ. 2:

చిత్తములో నీరూపు చింతలు నీమీఁదను
హత్తెను రెండూ నిట్టే అతివకును
కొత్తగా శ్రీవెంకటేశ కూడితివింతక ముందు
జొత్తుల చెమటచెలిఁ జూతువు రావయ్యా