పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-6 హిజ్జిజి సంపుటం: 08-138

పల్లవి:

దానికేమి తప్పదింతా తానే నేను
కానుకలు పచరించ కాలమెల్లా వలెనా

చ. 1:

మాటలే మూటలాయ మంతనములాడఁగాను
యేఁటివే తనసుద్దులు యెందాఁకానే
పాటించి తా మగఁడైన ఫలమిది చాలదా
కూటమికిఁ గొసరఁగ కొలువులో వలెనా

చ. 2:

చూపూలే రూపులాయ చూడఁగాఁ జూడఁగాను
యేపునఁ దనయెమ్మెలు యెందాఁకానే
చేపట్టి తాఁ బెండ్లాడేచేఁత యిదే చాలదా
తీపులు పచరించను తెరలోనే వలెనా

చ. 3:

నవ్వులే పువ్వులాయ నాపైఁ దనమోహమున
యెవ్వరు నెరఁగనివా యెందాఁకానే
రవ్వగాఁ గూడె శ్రీ వెంకటరాయఁడిది చాలదా
వువ్విళ్ళూర సన్నసేయ వొద్దనిట్టే వలెనా