పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-2 ఛాయనాట సంపుటం: 08-128

పల్లవి:

ఆఁడుజాతెల్లానొక్కటే అందరికి నొక్కచాలే
వాఁడి తనగోరే అయితే వద్దనేవారెవ్వరు

చ. 1:

సిగ్గువడ్డ నిన్నుఁ జూచి చిత్తమెల్లా నీరాయ
అగ్గలమై నిన్ను నాడే యాపె మాటకు
కగ్గుదేర నీవు మున్ను కట్టుకొన్న బయిరూపము
వొగ్గి ఆడక పోవునా వోరుచుకో యిఁకను

చ. 2:

తలవంచే నిన్నుఁ జూచి దైలువారె నాచెమట
చెలరేఁగి ఆపె నిన్నుఁ జేసేచేఁతకు
యెలమి నీవేడుకకు యెత్తుకొన్న యెత్తుకోలు
తెలిసిన వాఁడవిఁక దించవచ్చునా

చ. 3:

తేలగిలే నిన్నుఁ జూచి తెలివొందె నామొగము
కోలుముందై ఆపె నిన్నుఁ గూడఁగాను
యీలీల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
వేళకు వచ్చిన మేలు విడువఁగ వచ్చునా