పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-4 నారణి సంపుటం: 08-112

పల్లవి:

ఏలగడించుకొనేవు యెక్కడాలేనిసుద్దులు
తాలిమిఁ బానుపుచేరి తమకించరాదా

చ. 1:

జంకెనచూపులచేత చలివాపెఁ గాకయింతి
కొంకుఁగొసరుల నిన్నుఁగోపగించునా
వంకల చంద్రుల నించి వాఁడివెట్టెఁగాకనీకు
కంకిగా రతులలో ఘాతసేసునా

చ. 2:

నిట్టూర్పు గాలిచేత నిన్ను సేదదేర్చెఁగాక
జట్టిగొని వుంకించి కొసరవచ్చునా
బట్టబయలు మాటలపందిలిగాఁ బెట్టెగాక
నెట్టుకొన్న తిట్లతో నేరమెంచునా

చ. 3:

చిగురుఁజేతులచేత జిగిఁగాఁగిలించెఁగాక
వొగరుఁబంతాల నిన్ను వొరయించునా
అగపడి శ్రీవేంకటాధిప కూడితివిట్టే
మొగమోడెఁగాక నీకుమోవిగంటిసేసునా