పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-4 శ్రీరాగం సంపుటం: 06-052

పల్లవి:

కొల్లవలపులు చేకొనరాదా కడు
మెల్లని మాటాడరాదా మెకురేల సేయును

చ. 1:

నిక్కి నిక్కి చూచెఁగా నీవంక నెవ్వతో
మొక్కిన ఱెప్పల నింపు ముంచిముంచి
ఇక్కడ నీవుండఁగాను ఎంత గోపించునో
గ్రక్కున విచ్చేయరాదా కడుఁ దడవాయెను

చ. 2:

కన్ను సన్న జేసిన కలికి య దెవ్వతో
సన్నపు నవ్వులు నీపైఁ జల్లిచల్లి
ఎన్నరాని కాఁకలను ఏమిచేసునో నిన్ను
వన్నెలాఁడి నిను నింత వలపించుకొన్నది

చ. 3:

కొప్పు గడు దీచి తనకొనగొళ్ల నెవ్వతో
చెప్పరానిసిగ్గు నీపైఁ జిమ్మి చిమ్మి
యిప్పడె శ్రీవేంకటేశ యింతిం గూడుకొంటి వౌర
యెప్పుడుఁ బాయక మమ్ము నిక్కడ నీవుండరా