పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-1 రామక్రియ సంపుటం: 06-037

పల్లవి:

వెఱవక యింత విన్న వించఁగలమా నీ
మొఱఁగులు మానర మొక్కేము నీకు

చ. 1:

దేవతలిందఱు నీకుఁ దిరిగి తిరిగి మ్రొక్కి
దేవుండవు నిన్నుఁ దిట్ట వచ్చునా
గోవిందుఁడవైన నీకొయ్యతనాలకుఁ గడు
మోవనాడ వెఱతుము మొక్కేము నీకు

చ. 2:

చెలువుగ నజుఁడు పూజించె నీపాదాలు
తొలఁగక కాల నేఁద్రొక్క వచ్చునా
కలికితనముల వికారపుచేతల నా
మొలనూలు వట్టకురా మొక్కేము నీకు

చ. 3:

ఒక్కటై శ్రీసతిఁ బాయకుండ నీవురమున
మొక్కలపు నాగుబ్బలు మోవ వచ్చునా
చక్కని వేంకటగిరిస్వామి నన్నుఁ గూడితివి
మ్రొక్కిన మొక్కుల మారు మ్రొక్కేము నీకు