పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0047-5 ఆహిరి సంపుటం: 06-035

పల్లవి:

ఏమి సేయఁగ వచ్చు నిట్టుండు భాగ్యవశ
మామనియుఁ దాఁ గూడెఁ నక్కటా చెలికి

చ. 1:

తుడువరే కమ్మఁ గస్తురి బొట్టు నొస లెల్ల
కడుఁ గ్రాఁగి పొక్కె నదె కటకటా చెలికి
కడుగరే శిర సెల్లఁ గ్రాఁగి జవ్వాదిచే
జెడగట్టె ముంగురులు చెల్లఁబో చెలికి

చ. 2:

తియ్యరే నునుఁగౌనుఁ దీగ యొడ్డాణంబు
నొయ్యనె యిఁకనైన నొప్పదీ చెలికి
ముయ్యరే కుచకుంభములు బయలు పడకుండ
పయ్యదయు సవరించ భారమీ చెలికి

చ. 3:

చూపరే నాయకుని సుదతికి మేనెల్ల
ఆపసోపము రేఁగె నద్దిరా చెలికి
ఏపుమీఱఁగ వేంకటేశు డింతట వచ్చి
తాప మింతయు మాన్చి దక్కఁగాఁజెలికి