పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0058-5 సామంతం సంపుటం: 06-101

పల్లవి:

ఎటువంటి మోహమో యెట్టితమకమొ కాని
తటుకనను దేహ మంతయు మఱచెఁ జెలియ

చ. 1:

పలుకుఁదేనెలఁ గొసరి పసిఁడి కిన్నెర మీఁటి
పలుచ నెలుఁగున నిన్నుఁ బాడి పాడి
కలికి కన్నీరు బంగారు పయ్యద నొలుక
తలయూఁచి తనలోనె తలవంచుఁ జెలియ

చ. 2:

పడఁతి నీవునుఁ దాను పపళించు పరపువై
పొడము పరితాపమునఁ బొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటలఁ దోఁగి
యుడుకు నూరుపుల నుసురుసురాయెఁ జెలియ

చ. 3:

తావి చల్లెడి మోము దమ్మి గడు వికసించె
లోవెలితి నవ్వులను లోఁగి లోఁగి
శ్రీవేంకటేశ లక్ష్మీకాంత నినుఁ గలసి
యీ వైభవము లందె నిదివో చెలియ