పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0058-4 ఆహిరి సంపుటం: 06-100

పల్లవి:

ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము
వైకుంఠపతిపొందు వడిఁ దెలుపుకొఱకు

చ. 1:

పరగఁ గెమ్మోవిపై పగలు చుక్కలు వొడిచె
పరివేషమృగనాభిఁ బరగె మోము
మరునిసమరమునఁ గోమలి విభునితోఁ జెనకు
సరసతల కిదియ సూచన చంద మాయె

చ. 2:

ఎలమి బొమ్మలజంకె లింద్రధనువులు వొడిచె
మొలచెఁ గన్నులఁగావి మొయిలు ఘనమై
కొలఁది కగ్గలపుఁగుంకుమచెమట నెత్తురులు
పొలఁతిపైఁ గురియుటకుఁ బోటివలె నాయె

చ. 3:

అంగనకునెడమతొడ అదరి భూకంపంబు
సంగతి వహించెఁ జంచలము లేక
ఇంగితంబుగ వేంకటేశుఁ గూడినపొందు
కొంగుబంగారమై కోరికలు మీఱె