పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0014-03 నాట సం: 01-085 నృసింహ

పల్లవి:
ఇలయును నభమును నేకరూపమై
జలజల గోళ్ళు జళిపైంచితివి

చ.1:
ఎడసిన నలముక హిరణ్యకశిపునిఁ
దొడికపట్టి చేతుల బిగిసి
కెడపి తొడలపై గిరిగొన నదుముక
కడుపు చించి కహకహ నవ్వితివి

చ.2:
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పినబెబ్బులిక సరుహుంకృతుల
దెప్పరపసురల ధృతి యణఁచితివి

చ.3:
పెళ పెళనార్చుచుఁ బెడబొబ్బలిడుచు
థళథళ మెఱువఁగ దంతములు
ఫళఫళ వీరవిభవరసరుధిరము
గుళగుళ దిక్కుల గురియించితివి

చ.4:
చాతినుప్రేవులజన్నిదములతో
వాతెరసింహపువదనముతో
చేతులు వేయిటఁ జెలగి దితిసుతుని
పోతర మణఁపుచు భువి మెరసితివి

చ.5:
ఆహోబలమున నతిరౌద్రముతో
మహామహిమల మలయుచును
తహతహ మెదుపు చుఁ దగువేంకటపతి
యిహముఁ బరముఁ మా కిపు డొసఁగితివి