పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0013-04 శంకరాభరణం సం: 01-080 దశావతారములు


పల్లవి :

ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు
ఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడు


చ. 1:

ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁ
బైకొని యుండఁగ నొక వటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన-
శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు


చ. 2:

అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపము
సరుగన భూమింతయు నొక చరణంబున గొలచి
పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన
పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు


చ. 3:

క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా
ధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగను
చేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి
నారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు