పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0013-03 కన్నడగౌళ సం: 01-079 వెరాగ్యచింత


పల్లవి:

 దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట
కావలసిన సౌఖ్యంబులు గలుగ కమానీనా


చ. 1:

 ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు
యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధము
యెక్కడికెక్కడ నిజమై యివి దాసుండీనా


చ. 2:

 యీకాంతలు నీద్రవ్యము లీకన్నూలవెడయాసలు
యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై
యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా


చ. 3:

 దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము
పావనమై దురితంబులఁ బాయక మానీనా
ఆవిభుకరణరసమున నతఁడే తను మన్నించిన
ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా