పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0012-04 శ్రీరాగం సం: 01-075 వేంకటగానం


పల్లవి :

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు


చ. 1:

ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైన
యాతఁడేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు


చ. 2:

యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు


చ. 3:

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనో భావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు