పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0012-03 రామక్రియ 01-074 దశావతారములు


పల్లవి: ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు-
       దవ్వులనే వుండు తలంపులోనుండు

చ.1 : ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడు
       కడు దాఁగుఁగాని దొంగయుఁ గాడు
       వడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడు
       వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు

చ.2 : మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవు
       జగడాలు తపసివేషములును
       మగువకై పోరాడు మరి విరక్తుఁడును
       తగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము

చ.3 : తరుణుల వలపించు తగిలి పై కొనఁడు
       తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు
       తిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడును
       పరమమూర్తియై పరగు నీఘనుడు