పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0001-05 పాడి సం: 01-005 భక్తి
పల్లవి: వేదం బెవ్వని వెదకెడిని
ఆ దేవునిఁ గొనియాడుఁడీ
చ. 1: అలరిన చైతన్యాత్మకుఁడెవ్వఁడు
కలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనిన
తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ
యిల నాతని భజియించుఁడీ
చ. 2: కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడు
వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁ
దడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ
చ. 3: కదిసి సకలలోకంబులవారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుఁడీ