పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0008-02 ఆహిరి సం: 01-050 వైరాగ్య చింత
పల్లవి: జీవాతుమై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా
చ. 1: ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకా
జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
చ. 2: బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా
వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా
చ. 3: నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా
యేవియునునిజముగా వివియేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా