పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0098-01 సాళంగనాట సం; 01-489 వైరాగ్య చింత

పల్లవి:
అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము
మట్టుపడితే శాంతము మఱి యేలా

చ.1:
జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ
బడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపము
వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా

చ.2:
ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొక్కవేళ
మేరలేని చీకటియై మించును దుఃఖములెల్లా
వూరట లేనికర్మికి నొక్కొక్కవేళా

చ.3:
పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ
యెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకా
వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా