పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు:0౦97-05 భైరవి సం: 01-487 భగవద్గీత కీర్తనలు

పల్లవి:
నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు
భావించలేనివారిపాప మింతేకాని

చ.1:
పరమపద మొసఁగి పాపమడంచేనని
చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె
నిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదు
పరగ నమ్మనివారిపాప మింతేకాని

చ.2:
నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని
యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత
దాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచి
పైపై నమ్మనివారిపాప మింతే కాని

చ.3:
బంతిఁ బురాణములను భక్తసులభుఁడ నని
అంతరాత్మ వీమాట అడితివి తొలుతనే
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు
పంతాన నమ్మనివారిపాప మింతేకాని