పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0097-04 బౌళి సం: 01-486 అధ్యాత్మ


పల్లవి:
ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయ
తెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు

చ.1:
అనిశమును దేహమును కన్న పానము లిడిన
యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో
గొనకొన్న మానినుల కూటముల సుఖము లివి
మనసుదాటినపాలు మట్టులేదెపుడు

చ.2:
వొడలఁబెట్టినసామ్ము లొగిఁ దనకుఁ గానరా-
వడవిఁ గాసినవెన్నె లది కన్నులకును
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే
బెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట

చ.3:
చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు
యెద్దుయెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలో
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె