పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0095-04 సాళంగనాట సం: 01-474 రామ


పల్లవి :
రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడు
గోమున పరశురాముకోప మార్చెనటరే

చ. 1:
యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె

చ. 2:
మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తనుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె
యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే

చ. 3:
యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే