పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦95-03 శంకరాభరణం సం: 01-473 దశావతారములు


పల్లవి:
ఎంత భక్తవత్సలుఁడ విట్టుం డవలదా
వింతలు నీసుద్దులెల్లా వినఁబోతే నిట్టివే

చ.1:
యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు
బలివిభిషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా
తలచి చూడ నీదాసుల కోడుదువు

చ.2:
యిందరిపాలిటికిని యీశ్వరుఁడ వేలికవు
పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు
అందపునీదాసులకు నన్నిటా దాసుఁడవు

చ.3:
కడుపులో లోకముకన్న తండ్రి విన్నిటాను
కొడుకవు దేవకికిఁ గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు
విదువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి