పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0094-06 దేసాళం సం: 01-470 ఉపమానములు


పల్లవి:
అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు
పన్నినలోకులకెల్ల ప్రకృతి కారణము

చ.1:
తలఁపు గారణము తత్వవేత్తలకును
చలము గారణము సంసారులకును
ఫలము గారణము పరమవేదాంతులకు
కలిమి గారణము కర్ములకును

చ.2:
తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకు
తనువే కారణము తగ జంతువులకు
ఘనముక్తి గారణము కడగన్నవారికెల్లా
కనకమే కారణము కమ్మినబంధులకు

చ.3:
దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా
జీవుడు గారణము చిల్లరమనుజులకు
దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే
పావన మాతనికృప పరమకారణము