పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0094-04 దేసాక్షి సం: 01-468 వేంకటేశ్వరౌషధము


పల్లవి:
సకలజీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

చ.1:
మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది
పోఁడిమి నల్లవికాంతిఁ బొదలినది
పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాఁడే శేషగిరిమీద నాఁటుకొన్నమందు

చ.2:
పడిగెలు వేయింటిపాము గాచుకున్నది
కడువేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కువ వుండినది
కడలేనియంజనాద్రిగారుడపుమందు

చ.3:
బలుశంఖుజక్రములబదనికె లున్నది
తలఁచినవారికెల్లఁ దత్వమైనది
అలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది
వెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రిమందు