పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0093-03 ముఖారిసం: 01-461 నామ సంకీర్తన


పల్లవి:
వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల
పుడమిధరుఁడు మాఁకు భువనౌషథము

చ. 1:
హరి యచ్యుతాయంటే నణఁగుఁ బాపములు
నరసింహ యనియంటే నాఁటినదుఁఖములు మాను
పురుషోత్తమాయంటేఁ బుండ్లు బూచులు మాను
పరమౌషధ మీతఁడే పాటింప మాకు

చ. 2:
వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా
వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను
శ్రీసతీశ యనియంటే చింతలిన్నియును మాను
గాసిదీర నితడేపో ఘనదివ్యౌషధము

చ. 3:
గోవిందా యనియంటేఁ గూడును సంపదలు
యీవల మాధవయంటే నిహముఁ బరముఁ జేరు
దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు
శ్రీవేంకటేశుఁడే మాకు సిద్దౌషధము