పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0092-06 గుండక్రియ సం: 01-458 అథ్యాత్మ


పల్లవి:
రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోటఁ దానుండ దదివో

చ.1:
వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్న ధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము

చ.2:
కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ

చ.3:
నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ