పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦89-౦3 శుద్ధవసంతం సం; 01-437 అథ్యాత్మ


పల్లవి:
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
వింతవింతవిధముల వీడునా బంధములు

చ.1:
మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక
తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక
ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చ.2:
చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను
మదిగల్లి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా
యెదుట తారాజై తే నేలెనా పరము

చ.3:
పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా
జీవించేటిఫలమేది చింతదీరుదాఁకను
వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా