పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0089-02 నాట సం: 01-436 నృసింహ


పల్లవి:
నిక్కించీ గర్ణములు మానిసిమెకము
నిక్కపుఁ గరుణతో మానిసిమెకము

చ.1:
కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే
నిండురాజసమున మానిసిమెకము
గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్చు
నిండించీ నాకసము మానిసిమెకము

చ.2:
కరములు వేయింటాఁ గైకొని యాయుధములు
నిరతి జళిపించీ మానిసిమెకము
సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి
నెరపీని నవ్వులు మానిసిమెకము

చ.3:
యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ
నిక్కపుగాఁగిటను మానిసిమెకము
అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు
నెక్కొని మమ్మేలెను మానిసిమెకమ