పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0087-05 సాళంగనాట సం: 01-427 అథ్యాత్మ


పల్లవి:
నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ
చేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని

చ.1:
అందరిలో నంతర్యామివై నీవుండఁగాను
యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును
సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను
వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి

చ.2:
లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను
చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని
కైకొని యామాయలు నీకల్పితమై వుండఁగాను
చౌకలేక నేవేరే సంకల్పించితిని

చ.3:
యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగాను
యిక్కడాఁ దొత్తుల బంట్లు నేలితి నేను
చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను
మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను