పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0087-04 బౌళి సం: 01-426 ఉపమానములు


పల్లవి:
పట్టినచోనే వెదకి భావించవలెఁగాని
గట్టిగా నంతర్యామి కరుణించును

చ.1:
యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితే
వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును
అంటి కానరానితనయాతుమ తప్పకచూచు-
కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును

చ.2:
మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితే
అంచెలఁ దానే కుదురై నయట్టు
పొంచి హరినామమే యేపాద్దు నాలికతుదను
యెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము

చ.3:
వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితే
యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు
యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును
పక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును