పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు:0087-01 రామక్రియ సం; 01-423 వైష్టవ భక్తి


పల్లవి:
సులభమా యిందరికి జూడ సులభముగాక
కలిగె మీకృప నాకుఁ గమలారమణా

చ.1:
సతతదయాచారసంపన్నుఁడై మఱికదా
అతిశయవైష్టవాన కరుహుడౌట
వ్రతోపవాసతీర్థవరసిద్దుఁడైకదా
మితిమీరి నరహరి మీదాసుఁడౌట

చ.2:
సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదా
ప్రకటించి విష్ణునామపాఠకుఁడౌట
అకలంకమతితోడ నాజన్మశుద్దుఁడైకదా
అకుటిలమగుమీచక్రాంకితుఁడౌట

చ.3:
కెరలి సదాచార్యకృప గలిగినగదా
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ గనుట
మరిగి మీపై భక్తి మఱి ముదిరినఁ గదా
అరయ మీకే శరణాగతుఁడౌట