పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦౦86-06 లలిత సం: ౦1-422 వేంకటగానం

పల్లవి:
వాడె వేంకటాద్రిమీద వరదైవము
పోఁడిమితోఁ బొడచూపెఁ బొడవైన దైవము

చ.1:
వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు
పిక్కటిల్ల వెలుఁగొందే పెను దైవము
పక్కినను తనలోని పదునాలుగు లోకాలు
తొక్కి పాదానఁ గొలచే దొడ్డ దైవము

చ.2:
వేద శాస్త్రాలు నుతించి వేసరి కానఁగలేని
మోదపు పెక్కుగుణాల మూలదైవము
పోది దేవతలనెల్లఁ బుట్టించ రక్షించ
ఆదికారణంబైన అజుఁగన్న దైవము

చ.3:
సరుస శంఖచక్రాలు సరిఁబట్టి యసురల
తరగి పడవేసిన దండి దయివమూ
సిరి వురమున నించి శ్రీవేంకటేశుండయి
శరణాగతులఁగాచే సతమయిన దయివము