పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0086-01 లలిత సం; 01-417 అధ్యాత్మ


పల్లవి:
తహతహ లిన్నిటికి తానే మూలము గాన
సహజాన నూరకున్న సంతతము సుఖము

చ.1:
భారమైన పదివేలు పనులు గడించుకొంటే
సారెసారె నలయించకపోవు
తీరనియాసోదము దేహములో నించుకొంటే
వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు

చ.2:
వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే
వుండుఁబో మంచముకింద నొకనూయి
కొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటే
నండనే యాబహురూప మాడకపోదు

చ.3:
మనసురానివైన మంచివి చేసుకొంటే
తినఁదిన వేమైన దీపవును
తనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతే
యెనయుచు నేపని కెదురే లేదు