పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0084-06 రామక్రియ సం: 01-410 అంత్యప్రాస


పల్లవి:
భక్తి కొలఁది వాఁడే పరమాత్ముఁడు
భుక్తి ముక్తిఁ దానే యిచ్చు భువిఁ బరమాత్ముఁడు

చ.1:
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముఁడు
బట్టబయటి ధనము పరమాత్ముఁడు
పట్లుపగటి వెలుఁగు పరమాత్ముఁడు
యెట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు

చ.2:
పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడు
బచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడు
బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముఁడు
యిచ్చకొలఁది వాడువో యీ పరమాత్ముఁడు

చ.3:
పలుకుల లోని తేట పరమాత్ముఁడు
ఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడు
యెలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు