పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0083-05 బొళి సం; 01-403 శరణాగతి

పల్లవి:
ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్ల
కామించి నీవిచ్చితివి కైవల్యపదము

చ.1:
పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు
నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలు
వెట్టికి నే జాతియైన వెఱవ నీనామములు
వొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు

చ.2:
దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ_
కరుణఁ గైైంకర్యము గలిగితేఁ జాలు
నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ
బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు

చ.3:
యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ
పాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలు
కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ
యేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జూలును