పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0001-03 దేసాక్షి సం: 01-003 వైరాగ్య చింత
పల్లవి: హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాఁడే మేలు
చ. 1: అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి
పరిభవములనెల్లఁ బడితిఁ గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాఁడే మేలు
చ. 2: తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి
పలువేదనలనెల్లఁ బడితిఁగాని
కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి
నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు
చ. 3: కూపనరకమున గుంగి వెనకకు నేఁ
బాపవిధులనెల్లఁ బడితిఁగాని
యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె
నాపాలఁ గలిగినాఁడే మేలు