పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0079-02 భూపాళం సం; 01-377 మేలుకొలుపులు


పల్లవి:
మేదిని జీవులఁగావ మేలుకోవయ్యా
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా

చ.1:
తగుగోపికల కన్నుఁదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా

చ.2:
ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు శశివర్దుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య

చ.3:
వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషారహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా