పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0078-05 భూపాళం సం: 01-374 మేలుకొలుపులు


పల్లవి:
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా

చ.1:
ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా

చ.2:
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా

చ.3:
పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ
గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా