పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0061-01 ఛాయనాట సం; 01-310 వైరాగ్య చింత


పల్లవి:
తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ
దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు

చ.1:
మమకార విముక్తి మార్గదూరము నీపై
మమతసేయక నాకు మనరాదు
మమత మేలో నిర్మమత మేలో దీని-
క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు

చ.2:
కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని-
ష్కర్మము పాతకమునకుఁ దొడవు
కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ-
మర్మంపు మదము మాన దేమిసేతు

చ.3:
శరణాగత రక్షకుడవైనయట్టి
తిరువేంకటగిరిదేవుఁడా
పరిపూర్ణఁడవో నీవు పరిచ్చిన్నుఁడవో ని-
న్నరసి భజింపలేనైతి నేమిసేతు